హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో ఇవాళ అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవచ్చని వెల్లడించారు.ఇవాళ, రేపు ఆదిలాబాద్, నిర్మల్, కోమురంభీం – ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి,  జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు రాష్ట్రంలోని చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు.