లాలూ కోసం బెదిరింపులు... యోగి సీరియస్
లక్నో : దాణా స్కామ్‌ కేసులో తీర్పునిచ్చిన న్యాయమూర్తికి బెదిరింపు ఫోన్‌కాల్స్‌ వచ్చాయన్న వార్తల నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్‌ రంగంలోకి దిగారు. యూపీకి చెందిన ఇద్దరూ జడ్జిలే వీటి వెనుక ఉన్నట్లు ఆరోపణలు రావటంతో యోగి విచారణ కమిటీని  నియమించారు. జలౌన్‌ జిల్లా(యూపీ) న్యాయమూర్తి, సబ్‌ డివిజినల్‌ న్యాయమూర్తి ఇద్దరూ తీర్పు వెలువడక ముందు రాంచీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి శివపాల్‌ సింగ్‌ ను ఫోన్‌లో సంప్రదించారంట. లాలూ శిక్ష విషయంలో తాము చెప్పినట్లు చేయాలని.. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆ ఇద్దరు.. శివపాల్‌ను బెదిరించారంట. ఇదే విషయాన్ని శివపాల్‌ మీడియా దృష్టికి తీసుకెళ్లటంతో వార్త ప్రముఖంగా ప్రచురితం అయ్యింది. దీంతో యూపీ సీఎం విచారణకు ఆదేశించారు. విచారణ కమిటీ వార్తను ఆదిత్యానాథ్‌ మీడియా సలహాదారు మృత్యుంజయ్‌ కుమార్‌ ధృవీకరించారు. వీలైనంత త్వరలో ఈ ఘటనపై నివేదికను అందజేస్తానని  ఝాన్సీ కమిషనర్‌ అమిత్‌ గుప్తా వెల్లడించారు.
 
మాకేం తెలీదు... ఆరోపణలపై ఇద్దరు న్యాయమూర్తులు స్పందించారు. శివపాల్‌ సింగ్‌ చెబుతున్నట్లు తాము బెదిరింపులకు పాల్పడలేదని వారంటున్నారు. జలౌన్‌లోని ఓ భూవివాదానికి సంబంధించి శివపాల్‌తో తాము చర్చించినట్లు సబ్‌ డివిజినల్‌ న్యాయమూర్తి చెబుతుండగా.. జిల్లా న్యాయమూర్తి మన్నన్‌ అక్తర్‌ మాత్రం అసలు ఆయనతో ఎప్పుడూ మాట్లాడలేదని తెలిపారు.