హైదరాబాద్‌: ఇంటి నిర్మాణ అనుమతులను సరళతరం చేసే టీఎస్‌బీపాస్‌ చట్టాన్ని రాష్ట్ర అసెంబ్లీ సోమవారం ఆమోదించింది. ఈ బిల్లును మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు ప్రవేశపెడుతూ దాని విశేషాలను, ప్రభుత్వ బాధ్యతలు, ప్రజలకు కలిగే ప్రయోజనాలు, అక్రమార్కులపై చర్యలు.. ఇలా బిల్లులో పొందుపరిచిన  అన్ని విషయాల గురించి కూలంకషంగా వివరించారు. దేశంలోనే శరవేగంగా పట్టణీకరణ జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ తొలి స్థానంలో ఉన్నదని, దాదాపు 42 శాతం జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారని, అలాంటి పట్టణాల్లో సరైన మౌలిక వసతులు కల్పించేందుకు ఈ చట్టాన్ని తీసుకువస్తున్నామని తెలిపారు. ‘2019లోనే నూతన పురపాలక చట్టాన్ని ఈ సభలోనే తీసుకొచ్చాం. పౌరుడే కేంద్రంగా సమయపాలన పాటిస్తూ సేవలు అందించే లక్ష్యం పెట్టుకున్నాం. పట్టణ ప్రగతికి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం. అయితే, పట్టణ పౌరుడికి ఇబ్బందిగా మారిన సొంత ఇంటి నిర్మాణ అనుమతులను సరళతరం చేయటానికి 2015లోనే డెవలప్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ పర్మిషన్‌ సిస్టం(డీఎంపీఎస్‌)ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దానికి చట్టబద్ధత లేకపోవటం, అధికారులకు విచక్షణ లేకపోవటం వంటి కారణాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే పారదర్శకత పెంచేందుకు స్వీయ ధ్రువీకరణ పత్రం(సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌) విధానాన్ని తీసుకొస్తున్నాం’ అని కేటీఆర్‌ వెల్లడించారు. తెలంగాణ మున్సిపల్‌ చట్టం 2019, జీహెచ్‌ఎంసీ చట్టం భిన్నంగా ఉన్నాయని, వీటికి ఏకరూపం తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రస్తుతమున్న డీఎంపీఎస్‌ విధానానికి ఒక చట్టబద్ధత తీసుకొచ్చేలా టీఎస్‌బీపాస్‌ను తెస్తున్నామని వివరించారు.