కరోనాను ఎదుర్కోవడాన్ని.. ప్రపంచ దేశాలు సవాలుగా తీసుకుని పోరాటం చేస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌ని విధించాయి. అయినప్పటికీ ఈ వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. వ్యాక్సిన్ లేని ప్రాణాంతక వ్యాధి కావడంతో వైద్యులు, శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషిస్తూ తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. వీరికి అండగా, ప్రజల రక్షణకై పలు కంపెనీలు, ప్రముఖులు తమ వంతు ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తున్నారు. అలాగే చైనాకి చెందిన టిక్‌టాక్ యాప్.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం రూ.1900 కోట్లు విరాళం ప్రకటించింది. కరోనా మహమ్మారితో ఎక్కువగా ప్రభావితమైన వారి కోసం ఈ నిధులు ఇస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సహా ఇతర సంస్థల ద్వారా భారత్, ఇటలీ వంటి దేశాల్లో వైద్య సేవల కోసం రూ.1,140 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపింది. కాగా.. కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణకు తమ వంతు సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని టిక్‌టాక్ అధ్యక్షుడు అలెక్సా జూ తెలిపారు. అలాగే ఇప్పటికే గూగుల్, ఫేస్ బుక్, ట్విట్టర్ సహా ఇతర సామాజిక మాధ్యమ సంస్థలు విరాళాలు ప్రకటించగా తాజాగా టిక్‌టాక్ వాటి సరసన చేరింది.