అమెరికా: టిక్‌టాక్ పేరెంట్ కంపెనీ బైట్‌డ్యాన్స్‌తో లావాదేవీల‌ను నిలిపివేయాల‌ని అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు.  జాతీయ భ‌ద్ర‌త‌ను కాపాడేందుకు టిక్‌టాక్ ఓన‌ర్ల‌పై దూకుడుగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ట్రంప్ త‌న ఆదేశాల్లో స్ప‌ష్టం చేశారు.

45 రోజుల్లోగా టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌తో లావాదేవీల‌ను నిలిపివేయాల‌ని ట్రంప్ త‌న ఆదేశంలో స్ప‌ష్టం చేశారు.  చైనా ప్ర‌భుత్వ ఆధీనంలో లేమ‌ని, ఆ దేశానికి ఎటువంటి స‌మాచారం ఇవ్వ‌డం లేద‌ని టిక్‌టాక్ పేర్కొన్న‌ది.  టిక్‌టాక్ త‌ర‌హాలోనే ట్రంప్ వీచాట్‌ను కూడా నిషేధించాలంటూ ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు జారీ చేశారు.  జాతీయ ఎమ‌ర్జెన్సీ నేప‌థ్యంలో ఇన్ఫ‌ర్మేషన్‌, క‌మ్యూనికేష‌న్ టెక్నాల‌జీ అంశంలో అద‌‌న‌పు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ట్రంప్ తన  ఆదేశాల్లో పేర్కొన్నారు.  చైనాలో అభివృద్ధి చేసిన మొబైల్ అప్లికేష‌న్ల వ‌ల్ల అమెరికా జాతీయ భ‌ద్ర‌త‌, విదేశీ విధానం, ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ప్ర‌మాదం ఏర్పడిన‌ట్లు ట్రంప్ తెలిపారు.