తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శుక్రవారం వైభవంగా అంకురార్పణ జరిగింది. శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించే కార్యక్రమమే అంకురార్పణ. అద్దాల మండపంలో పుట్టమన్ను సేకరించి శాస్త్రోక్తంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల అదనపు ఈవో ధర్మారెడ్డి, అర్చకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో బ్రహ్మోత్సవాలను ఈ సారి ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. గుడి ప్రాకారం లోపలే బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. టీటీడీ బోర్డు చరిత్రలో ఇలా ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం. ఈనెల 19 నుంచి 27వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. రేపు (శనివారం) ధ్వజారోహణం, పెద్ద శేషవాహన సేవ నిర్వహించనున్నారు. ఈనెల 23న గరుడసేవ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. తిరుమల చేరుకుని శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.