అమరావతి: కరోనా వైద్య సేవల్లో ఎక్కడా ఏ లోటు రాకూడదని, సిబ్బంది నియామకాలు త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని కోవిడ్‌ ఆస్పత్రుల్లో ప్లాస్మా థెరపీకి అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా ఆరోగ్య ఆసరాలో ఆర్థిక సహాయం పెంచామని, సాధారణ కాన్పుకు రూ.5 వేలు. సిజేరియన్‌కు రూ.3 వేలు అందించనున్నట్లు తెలిపారు. అన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో తప్పనిసరిగా హెల్ప్‌డెస్క్‌లు ఉండాలని, ఆరోగ్యమిత్రలు ఆరు రకాల బాధ్యతలు నిర్వర్తించాలని పేర్కొన్నారు.  అదే విధంగా.. జిల్లా స్థాయిలో ఆరోగ్యశ్రీ పథకం సమన్వయ బాధ్యతలు జేసీకి అప్పగిస్తున్నట్లు వెల్లడించారు. మరింత సమగ్ర సమాచారంతో ఆరోగ్యశ్రీ క్యూఆర్‌ కోడ్‌ కార్డులు రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. కోవిడ్‌–19 నివారణ చర్యలు, ఆరోగ్యశ్రీ పథకంపై సీఎం జగన్‌ తన క్యాంపు ఆఫీసులో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితుల గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని, కోవిడ​ నిర్ధారణ పరీక్షలు,  వైద్య సదుపాయాలు తదితర అంశాల గురించి సమావేశంలో తెలిపారు.