హైదరాబాద్‌: యాదాద్రి– భువనగిరి జిల్లాకు చెందిన పి.ధాత్రిరెడ్డి సివిల్‌ సర్వీసెస్‌ ఫలితాల్లో అల్‌ ఇండియా 46వ ర్యాంకు సాధించి భేష్‌ అనిపించుకున్నారు. ధాత్రిరెడ్డి గతంలో సివిల్స్‌ రాసి 283 ర్యాంకు సాధించారు. ప్రస్తుతం ఐపీఎస్‌ శిక్షణలో ఉన్న ఆమె మళ్లీ పట్టుదలతో సివిల్స్‌ రాసి ఐఏఎస్‌లో 46వ ర్యాంకును సాధించారు. యూపీఎస్‌సీ మంగళవారం వెల్లడించిన సివిల్‌ సర్వీసెస్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు ప్రతిభ చాటారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అధికసంఖ్యలో ఎంపికై సివిల్స్‌లో తమ సత్తా చాటారు. ప్రతిష్టాత్మకమైన ఇండియన్‌ సివిల్‌ సర్వీసెస్‌కు 829 మంది ఎంపిక కాగా అందులో 50 మందికి పైగా తెలుగు విద్యార్థులు ఉన్నారు. సివిల్‌ సర్వీసెస్‌– 2019కు సంబంధించిన తుది ఫలితాలు మంగళవారం యూపీఎస్సీ విడుదల చేసింది. ఇందులో 829 మంది అభ్యర్థులను సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపిక చేసినట్లు ప్రకటించింది. సివిల్స్‌కు ఎంపికైన వారిలో 304 మంది జనరల్‌ కేటగిరీలో ఎంపికయ్యారు.