నల్లగొండ: నాగార్జునసాగర్‌కు భారీగా ఇన్‌ఫ్లో వస్తోందని అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం 8 గంటలకు నాగార్జునసాగర్ గేట్లు ఎత్తివేస్తున్నట్లు పేర్కొన్నారు. 4 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయనున్నారు. సాగర్‌లో గంటకు అడుగు చొప్పున నీటిమట్టం పెరుగుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సోమవారం నుంచి కృష్ణానదిలోకి వెళ్లొద్దని కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ హెచ్చరించారు. 

కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురిసిన వర్షాలతో వరద భారీగా పెరిగింది. రికార్డు స్థాయిలో 5,86,905 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. ఒకట్రెండు రోజుల్లో తుంగభద్ర నుంచి మరో లక్షకుపైగా క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని ప్రాజెక్టు ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. శనివారం సాయంత్రం జూరాల ప్రాజెక్టు నుంచి 45గేట్ల ద్వారా 5.93లక్షల క్యూసెక్కులు శ్రీశైలం ప్రాజెక్టుకు వదులుతున్నారు. శ్రీశైలానికి ఇన్‌ప్లో పెరగడంతో నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు.