హైద‌రాబాద్ :  రాష్ట్రంలో అర్బ‌న్ పార్కుల అభివృద్ధికి పెద్ద ఎత్తున కృషి చేస్తున్నామ‌ని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.  శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా అర్బ‌న్ పార్కుల అభివృద్ధిపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి కేటీఆర్ స‌మాధానం ఇచ్చారు. ఇప్ప‌టికే తెలంగాణ‌లో 1893 అభివృద్ధి చెందిన‌ అర్బ‌న్ పార్కులు ఉన్నాయ‌ని తెలిపారు. ఈ పార్కుల‌తో పాటు అద‌నంగా మ‌రో 1799 అర్బ‌న్ పార్కుల‌ను అభివృద్ధి చేయాల‌ని ప్ర‌తిపాదించామ‌ని చెప్పారు. ఇందులో భాగంగా ఇప్ప‌టికే 797 పార్కుల‌ను అభివృద్ధి చేశామ‌న్నారు. మొత్తంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 587, ఇత‌ర మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్ల ప‌రిధిలో 1109, హెచ్ఎండీఏ ప‌రిధిలో 103 పార్కుల‌ను అభివృద్ధి చేస్తున్నామ‌ని తెలిపారు. ఈ పార్కుల్లో కొన్నింటిని ట్రీ పార్కులుగా, మ‌రికొన్నింటిని ల్యాండ్ స్కేప్, అర్బ‌న్‌, పంచ‌త‌త్వ పార్కులుగా అభివృద్ధి చేయాల‌ని ప్ర‌తిపాదించ‌మ‌న్నారు.  సీఎం కేసీఆర్ ను మించిన హ‌రిత ప్రేమికుడు ప్ర‌పంచంలో ఎక్క‌డా లేరు అనుకుంటున్నాన‌ని తెలిపారు. దేశంలో ఏ  రాష్ట్రంలో పెట్ట‌ని విధంగా మున్సిపాలిటీ బ‌డ్జెట్‌లో 10 శాతం గ్రీన్ బ‌డ్జెట్‌ను పెట్టారు. ప‌ట్ట‌ణ హ‌రిత ప్ర‌ణాళిక రూపొందించుకుని మొక్క‌లు నాటుతున్నార‌ని తెలిపారు. హ‌రిత‌హారం ఒక సంస్కృతిగా మారింద‌న్నారు. ప్ర‌తి పౌరుడి న‌ర‌న‌రాన హ‌రిత‌హారం కార్య‌క్ర‌మం ఉండిపోయింద‌న్నారు. 80 శాతం మొక్క‌లను బ‌తికించేందుకు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని కేటీఆర్ తెలిపారు. భ‌విష్య‌త్ త‌రాల కోసం ఈ కార్య‌క్ర‌మాన్ని సీఎం కేసీఆర్ చేప‌ట్టార‌ని చెప్పారు. రాష్ట్రంలో గ్రీన్ క‌వ‌ర్ 29 శాతానికి పెరిగింద‌న్నారు. ఈ ఘ‌న‌త త‌మ‌కే ద‌క్కుతుంద‌న్నారు. పంచ‌ద‌నం పెంపు వ‌ల్ల రాజ‌కీయాలు ఉండ‌వు అని మంత్రి స్ప‌ష్టం చేశారు. దేశంలోనే అతిపెద్ద అర్బ‌న్ ఎకో పార్కు మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో 287 ఎక‌రాల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏర్పాటు చేశార‌ని తెలిపారు. జీహెచ్ఎంసీ పార్కుల్లో స్థ‌లం ఉంటే అక్క‌డ ఓపెన్ జిమ్‌లు ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కేటీఆర్ తెలిపారు.