హైదరాబాద్ :  అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ``అప్పుడు ఎప్పుడో తెలుగు సినిమాలకు 8 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. తర్వాత అవార్డులు రావడం తగ్గిపోయాయి. ఇప్పుడు 7 అవార్డులు వచ్చింది. అందులో రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన `చి.ల.సౌ`కు అవార్డ్ రావడం.. ఆ సినిమా నిర్మాతల్లో నేను ఒకడిని కావడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. `మహానటి` సినిమాలో కీర్తిసురేశ్‌కి ఉత్తమనటి అవార్డు వచ్చింది. అలాగే `రంగస్థలం`, `అ!`, `చి.ల.సౌ` సినిమాలకు అవార్డులు వచ్చాయి. నేను ఎప్పుడూ నా కెరీర్‌లో కొత్తదనం చూపించాలనుకున్నాను. చేస్తూ వచ్చాను. ఒకే టైప్ సినిమాలు చేస్తున్నప్పుడు నాకు నచ్చట్లేదు, అలాగే యూత్‌కి కూడా నచ్చడం లేదని ఏదో చేయాలని `గీతాంజలి` సినిమా చేశాను. ఫస్ట్ టైమ్ రెగ్యులర్ సినిమాకు భిన్నంగా ఆ సినిమా చేశాను. ఇప్పుడు ఆ సినిమా కల్ట్ క్లాసిక్. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా యాక్సెప్ట్ చేయడానికి చాలా సమయం పట్టింది. 1988లో డిజిటల్ లేకపోవడం వల్ల ఫోన్‌లో చెబితే అక్కడిక్కడే ఎడిటింగ్ చేసేవాళ్లు. సీడెడ్‌లో అయితే గీతాంజలి సినిమా జగడజగడ.. పాట నుండి స్టార్ట్ అవుతుంది. అదేంటని అడిగితే హీరోకి క్యాన్సర్ అని ముందే తెలిస్తే సినిమా డల్ అయిపోతుందని వాళ్లే నిర్ణయించుకుని ఎడిట్ చేశారు. దాన్ని తర్వాత ఎక్కడో యాడ్ చేసుకున్నారు. కానీ ఫైనల్లీ ఆ సినిమాను వారం తర్వాత అందరూ దాన్ని యాక్సెప్ట్ చేశారు. నా బెస్ట్ మూవీస్‌లో `గీతాంజలి`ని కల్ట్ క్లాసిక్ అంటుంటారు. శివ అయిన తర్వాత నిర్ణయం చేశాను. ఇప్పుడు నిర్ణయం చిత్రాన్ని మంచి సినిమా అంటారు. కానీ సినిమాకు మేం పడ్డ తిప్పలు మాకే తెలుసు.

ఇలా చాలా సినిమాలున్నాయి. అవేంటో మీకు కూడా తెలుసు. అన్నమయ్య సినిమా 8వ రోజు కలెక్షన్స్ రెంట్స్ కూడా కట్టలేని పరిస్థితికి చేరుకున్నాయి. నేను, రాఘవేంద్రరావు, దొరస్వామిరాజుగారు చాలా బాధపడ్డాం. చాలా మంచి సినిమా చేశామనుకున్నాం. అప్పుడు ఓ టూర్ వెళ్లినా కూడా వర్కవుట్ కాలేదు. అయితే 11వ రోజు.. ఏం జరిగిందో ఏమో కానీ.. మ్యాట్నీ నుండి అన్ని థియేటర్స్ హౌస్‌ఫుల్స్ అయ్యాయి. ఆ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో అందరికీ తెలుసు. నాకు నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. అలాగని ఇప్పుడు నేను ఆ సినిమాలతో `మన్మథుడు 2`ని పోల్చాలని అనుకోవడం లేదు. `మన్మథుడు` కూడా విడుదలైనప్పుడు డైరెక్టర్ విజయ్ భాస్కర్ వచ్చి.. ఎక్కడో తప్పు చేశాం సార్! అని అన్నారు. ఏం లేదండి.. కొత్త రకమైన సినిమా.. కొత్త డైలాగ్స్.. టైం పడుతుందని చెప్పాను. తర్వాత ఆ సినిమా ఎలాంటి విజయాన్ని సాధించింతో తెలిసిందే. నాలో కొత్తదనం చూసుకోవాలి అని ఆలోచించి `మన్మథుడు 2` చేశాను. నేను ఎక్స్‌పెరిమెంట్స్ చేసే ఇక్కడి వరకు వచ్చాను. మన్మథుడు 2కూడా అలాగే చేశాం. అయితే దీన్ని వెంటనే యాక్సెప్ట్ చేయలేరు. కాస్త సమయం తీసుకుంటుంది. కలెక్షన్స్ చూసి చాలా సంతోషమేసింది. అందరూ ఫోన్స్ చేసి అభినందిస్తున్నారు. ఒక పక్క బిగ్‌బాస్ సంతోషం.. మరో పక్క ఇదొక సంతోషం. తల్లికొడుకుల మధ్య అనుబంధం, తల్లి పడే తాపత్రయం, నాకు, వెన్నెల కిషోర్ మధ్య ఉండే కామెడీ.. అన్ని ప్రేక్షకులకు నచ్చుతాయి. కలెక్షన్స్ బావుంటేనే నిర్మాత మరో సినిమా తీయగలుగుతాడు. `ఆర్.ఎక్స్ 100` సినిమాలో సాంగ్స్ చూసి నచ్చి చైతన్‌ని పిలిచి మ్యూజిక్ చేయమని అన్నాను. తను అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. రెండు సాంగ్స్ ట్రెండింగ్‌లో కూడా ఉన్నాయి. `నిన్నేపెళ్ళాడతా` తర్వాత లక్ష్మిగారితో నటించాలని అనుకున్నాను. అయితే ఆమెకు సూట్ అయ్యే రోల్ దొరకలేదు. ఈ సినిమాలో మళ్లీ ఆమెతో నటించే అవకాశం దక్కింది. చాలా హుందాగా నటించారు. ఝాన్సీ, దేవదర్శిని, నిశాంతి, కిట్టు చక్కగా నటించారు. నాకు, వెన్నెలకిషోర్ మధ్య కామెడీ ట్రాక్ అద్భుతంగా కుదిరింది. అలాగే రావు రమేశ్‌గారు నా మావయ్య పాత్రలో నటించారు. రకుల్ ఎక్సలెంట్. చాలా పర్‌ఫెక్ట్‌గా నటించింది`` అన్నారు. 

మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు నాగార్జున సమాధానాలిచ్చారు.


* డివైడ్ టాక్ బయట థియేటర్స్‌లో కనపడటం లేదు. మన మీడియా వర్గాల్లోనే ఉన్నట్లుగా అనిపిస్తుంది. అలా ఉండుంటే కలెక్షన్స్ ఇలా ఉండవు. ఇంకా ముందుకెళ్లే కొద్ది న్యూ ఏజ్ సినిమా అని అంటున్నారు. 
* `మన్మథుడు 2` అనే టైటిల్ పెట్టి ఫ్యామిలీ ఎమోషన్స్‌కు ప్రాముఖ్యత ఇస్తే కాస్త ఇబ్బంది కావచ్చు.. అలాగే కాకపోవచ్చు కూడా. కల్ట్ నేమ్స్ ఉపయోగించడం వల్ల అందులో ప్లస్‌లుంటాయి... అలాగే మైనస్‌లు కూడా ఉంటాయి. 
* సక్సెస్ వచ్చిన తర్వాత దాన్నే పట్టుకుని ఎంతకాలం ఉండాలి. దాన్ని ఉపయోగించుకుని కొత్త వారికి అవకాశాలు ఇవ్వడం.. కొత్తగా ట్రై చేయాలి. ఇది నాన్నగారి దగ్గర నుండి నేర్చుకున్నాను. నాన్నగారికి అంత లాంగ్ కెరీర్, డిఫరెంట్ క్యారెక్టర్స్ వచ్చాయంటే కారణం ఆయన ఎప్పుడూ కొత్తగా ట్రై చేస్తుండేవారు. ఆయన చేసిన సినిమాలను గమనిస్తే అప్పట్లో అవి న్యూ జనరేషన్ మూవీసే. ఉదాహరణకు `మూగమనసులు` సినిమా కథను చెబితే ఎవరైనా తీస్తారా? అని అంటాం. ఆయన అంతలా ముందు ఆలోచించారు. అలాగే ఆదుర్తి సుబ్బారావుగారి సినిమాలన్నీ న్యూ జనరేషన్ మూవీసే.  
* ఒకరిని ఉద్దేశించి నువ్వు తప్పుచేస్తున్నావని చెప్పడం అలవాటు లేదు. కానీ బిగ్‌బాస్‌లో అలా చెప్పడం ఓ కొత్త ఎక్స్‌పీరియన్స్‌గా అనిపిస్తుంది.