హైదరాబాద్‌: కారుణ్య నియామకాల కింద ఉద్యోగంలో చేరిన సింగరేణి కార్మికుల పిల్లలకు ఉద్యోగ అర్హతలను బట్టి పోస్టింగ్‌ ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు లేవనెత్తిన అంశాలపై సీఎం కేసీఆర్‌ స్పష్టతనిచ్చారు. అయితే, కొత్తగా పోస్టులను సృష్టించలేమని, సంస్థలో ఖాళీలు ఏర్పడే కొద్దీ ఆయా పోస్టుల్లో అర్హతను బట్టి అవకాశం కల్పిస్తామని స్పష్టంచేశారు. ముందు జనరల్‌ మజ్దూర్‌గా చేర్చుకుంటామని, సంస్థ అలవాట్లను అలవర్చుకున్నాక కొంతకాలం శిక్షణనిచ్చి ఉన్నతస్థాయి ఉద్యోగం కల్పిస్తామని వెల్లడించారు. సింగరేణి కార్మికుల సేవలను సరిహద్దులో పనిచేసే సైనికులతో సీఎం పోల్చారు. కార్మికులకు ఆదాయం పన్నును రద్దుచేసే అధికారాలు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేవని, కేంద్రమే ఆ నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఈ విషయంపై గతంలోనే ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లామని, అందుకు వారు ఒప్పుకోలేదని సీఎం వెల్లడించారు. అయినప్పటికీ ఐటీ రద్దు అంశంపై పోరాడతామని, ఈ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని అన్నారు. ఇక, ప్రతి ఉద్యోగికి పదవీవిరమణ ప్రయోజనాలను అందిస్తామని కేసీఆర్‌ చెప్పారు. విరమణ పొందిన ఉద్యోగిని ప్రభుత్వమే సన్మానించి, ప్రభుత్వ వాహనంలోనే ఇంటివద్ద దించి గౌరవిస్తామని తెలిపారు. త్వరలోనే క్యాబినెట్‌లో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.