హైద‌రాబాద్: మద్యం షాపుల సమయ వేళల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం షాపులు తెరిచి ఉంచే వేళల్లో మార్పులు చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటి వరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు మాత్రమే మద్యాన్ని విక్రయించాలనే నిబంధనను అమలు చేశారు. తాజాగా అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా వైన్ షాపులపై ఉన్న ఆంక్షలను పూర్తిగా ఎత్తివేశారు. లాక్‌డౌన్ విధింపునకు ముందుగా ఉన్న సమయమే ఇప్పుడూ కొనసాగుతుందని ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉదయం 10 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు మద్యం షాపులు తెరిచి ఉంచేవారు. తాజాగా ఉత్తర్వులతో గతంలో మాదిరిగానే మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మద్యం అమ్మకాలపై పూర్తిగా నిషేధం విధించారు. కొంతకాలం తరువాత టైమ్ లిమిట్స్ విధించి మద్యం అమ్మకాలు జరిపేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది . ఆ తరువాత కొంత కాలం తరువాత వైన్ షాపులు తెరిచి వుంచే సమయ వేళలను స్వల్పంగా పెంచుతూ నిర్ణయించారు. తాజా ఉత్తర్వులతో ఉన్న పరిమితులన్నింటినీ ఎత్తివేశారు. దీంతో రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా వైన్ షాపులు ఉదయం 10 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు తెరుచుకోనున్నాయి.