అస్సాం :  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అస్సాం రాష్ట్రంలోని మోరిగావ్ జిల్లాలోని లహరిఘాట్ కస్పూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. కస్తూర్భా గాంధీ విద్యాలయాల్లో బాలికలకు కల్పిస్తున్న వసతులు, విద్యా పరిస్థితులను స్వయంగా పర్యవేక్షించారు. అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు. 
 
బాలికా విద్యపై కేంద్రం నియమించిన సెంట్రల్ అడ్వయిజరీ బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్ సబ్ కమిటీ రెండో సమావేశం నిమిత్తం ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి గౌహతి వెళ్లారు. శుక్రవారం సబ్ కమిటీ సమావేశంలో కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలను మరింత ప్రోత్సహించాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం 8వ తరగతి వరకే కేంద్రం కేజీబీవీలలో చదివేందుకు ఆర్ధిక సాయం చేస్తోంది. కేజీబీవీలను 8వ తరగతికే పరిమితం చేయకుండా 12వ తరగతి వరకు పెంచాలని, దీనిని పూర్తిగా కేంద్ర ఆర్ధిక సాయంతోనే నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల వల్ల బాలికలకు మంచి విద్య అందుతోందని తెలిపింది. ఇందులో భాగంగా అస్సాంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్నిసందర్శించి అక్కడి పరిస్థితిలను అడిగి తెలుసుకున్నారు. కస్తూర్భా గాంధీ విద్యాలయం ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. కేజీబీవీలను మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై వారితో చర్చించారు.
 
అస్సాంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయానికి ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరితో పాటు ఆయన సతీమణి వినయారాణి కూడా వెళ్లి విద్యార్థినిలతో గడిపారు. అనంతరం స్థానికంగా ఉన్న ప్రఖ్యాత కామాక్య ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు.