దుబాయ్‌: ప్రేక్షకులు లేరన్న లోటే ఉంది కానీ... ఐపీఎల్‌–2020 టోర్నీలో బోలెడంత థ్రిల్‌ రోజూ అందుతోంది. రెండో మ్యాచ్‌ ‘సూపర్‌’దాగా సాగితే... మూడో మ్యాచ్‌ ‘బౌల్డ్‌’ మలుపులు తిరిగింది. పటిష్టమనుకున్న స్కోరే తర్వాత పలుచన అయింది. సాఫీగా సాగుతున్న ఇన్నింగ్స్‌ సాగిలపడిపోయింది. సోమవారం జరిగిన పోరులో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 10 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టును ఓడించి బోణీ కొట్టింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఓపెనర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ (42 బంతుల్లో 56; 8 ఫోర్లు), డివిలియర్స్‌ (30 బంతుల్లో 51; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో మెరిపించారు. లక్ష్యఛేదనకు దిగిన హైదరాబాద్‌ 19.4 ఓవర్లలో 153 పరుగుల వద్ద ఆలౌటైంది. బెయిర్‌స్టో (43 బంతుల్లో 61; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ చహల్‌ 3 వికెట్లు తీశాడు. గాయాల తాకిడి కొనసాగింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్ చీలమండ గాయంతో మైదానం వీడాడు.