షార్జా: సీజన్‌ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌పై గెలిచి బోణీ కొట్టిన ధోనీ సేనకు రెండో మ్యాచ్‌లో షాక్‌ తగిలింది. బ్యాట్స్‌మెన్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌లకు బౌలర్ల కృషి తోడవడంతో మంగళవారం షార్జా క్రికెట్‌ స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. సంజూ శాంసన్‌ (32 బంతుల్లో 74; 1 ఫోర్‌, 9 సిక్సర్లు), స్టీవ్‌ స్మిత్‌ (47 బంతుల్లో 69; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలకు ఆర్చర్‌ (8 బంతుల్లో 27 నాటౌట్‌; 4 సిక్సర్లు) తుఫాన్‌ ఇన్నింగ్స్‌ తోడవడంతో రాజస్థాన్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 216 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో సామ్‌  కరన్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యఛేదనలో చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. సీజన్‌ తొలి మ్యాచ్‌లో దంచికొట్టిన తెలుగు ఆటగాడు అంబటి రాయుడు గైర్హాజరీలో సూపర్‌ కింగ్స్‌ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. డుప్లెసిస్‌ (37 బంతుల్లో 72; 1 ఫోర్‌, 7 సిక్సర్లు) ఒక్కడే ధాటిగా ఆడాడు. రాజస్థాన్‌ బౌలర్లలో తేవటియా 3 వికెట్లు పడగొట్టాడు. శాంసన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది.