ఢిల్లీ: టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ చేతన్‌ చౌహాన్‌  మృత్యువుతో పోరాడుతూ ఆదివారం కన్నుమూశారు. గత నెలలో కరోనా వైరస్‌ సోకడంతో అతని ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురుగ్రామ్‌లోని ఓ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స  తీసుకుంటుండగానే తాజాగా తుదిశ్వాస విడిచారు. ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌  ప్రభుత్వంలో 73ఏండ్ల చౌహాన్‌ కేబినెట్‌ మంత్రిగా ఉన్నారు.జూలై 12 కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయన లక్నోలోని సంజయ్‌ గాంధీ పీజీఐ హాస్పిటల్‌లో చేరారు. అక్కడ అతని ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడకపోగా మరింత క్షీణించింది.  దీంతో ఆయనను గురుగ్రామ్‌లోని మెదాంతకు తరలించారు. చికిత్స సమయంలోనే ఆయనకు బీపీతో పాటు కిడ్నీ సంబంధ సమస్యలు తలెత్తాయి. భారత్‌ తరఫున 40 టెస్టులు ఆడిన చౌహాన్‌..లెజండరీ సునీల్‌ గావస్కర్‌తో సుదీర్ఘకాలం ఓపెనర్‌గా బరిలో దిగారు. ఢిల్లీ అండ్‌ డిస్ట్రిక్ట్స్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో పలు హోదాల్లో పనిచేశారు.