హైదరాబాద్: పోలీసులు హైదరాబాద్‌ నగరంలో గుట్టుగా సాగుతున్న హవాలా రాకెట్ ను ఛేదించారు. నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వీరి నుంచి రూ.3.75 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. బంజారా హిల్స్ ప్రాంతంలోని ఓ ఇంట్లో హవాలా డబ్బు మార్పిడి జరుగుతున్నట్లు అందిన విశ్వసనీయమైన సమాచారం మేరకు హైదరాబాద్ పోలీసులు దాడి జరిపి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.3.75 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. విచారణలో, నిందితులందరూ ముంబైకి చెందిన కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలిసింది. సంస్థ యజమాని అహ్మదాబాద్ స్థానికుడిగా గుర్తించారు. హైదరాబాద్‌లో బ్రాంచ్ ఆఫీస్ పెట్టుకున్న ఆయన.. ఆ డబ్బును మహారాష్ట్రలోని సోలాపూర్‌కు రవాణా చేస్తున్నారని గుర్తించారు. స్వాధీనం చేసుకున్న డబ్బును ఆదాయపు పన్ను శాఖకు అందజేయనున్నామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.