హైదరాబాద్‌: సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌.. ఇన్‌స్టాగ్రాం, వాట్సాప్‌, మెసెంజర్‌ చాట్‌లను ఒకే యాప్‌లో విలీనం చేసేందుకు తన ప్రణాళికలను ప్రకటించింది. ఇందులో భాగంగానే  కొన్నింటిని విలీనం చేసే దిశగా పని ప్రారంభించింది. ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌నుంచి ఫేస్‌బుక్‌  మెసెంజర్‌కు డైరెక్ట్‌ మెసేజ్‌ చేసేలా కొత్త ఫీచర్‌ తీసుకొచ్చింది. గ్రహీతకు ఇన్‌స్టాగ్రాం ఖాతా లేకున్నా ఈ మెసేజ్‌ చేయవచ్చు. ఈ సౌకర్యం ప్రస్తుతం యూఎస్‌లోని ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ ఇన్‌స్టాగ్రాం యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. అనంతరం అన్ని చోట్ల ఈ ఫీచర్‌ తీసుకురానున్నారు. అలాగే, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ కుడి-ఎగువ మూలలో ఉన్న లోగోను మెసెంజర్‌ లోగోగా మార్చారు. ఈ మెసేజ్‌లన్నీ కూడా ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్ట్‌ అవుతాయని ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకెన్‌బర్గ్‌ వెల్లడించారు.