లండన్‌: కరోనా కరాళ నృత్యం కొనసాగుతున్నది. జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ వివరాల ప్రకారం.. గురువారం నాటికి ప్రపంచవ్యాప్తంగా 3 కోట్లకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇందులో సగానికి పైగా కేసులు అమెరికా, భారత్‌, బ్రెజిల్‌లోనే రికార్డయ్యాయి. గడిచిన నెల రోజుల వ్యవధిలోనే కోటి కేసులు నమోదవ్వడం గమనార్హం. కేసులు, మరణాల్లో అమెరికా తొలి స్థానంలో ఉన్నది. ఆ దేశంలో 66,75,560 కేసులు నమోదుకాగా, 1,97,643 మంది మరణించారు. భారత్‌లో 52,14,677 కేసులు, 84,372 మరణాలు, బ్రెజిల్‌లో 44,55,386 కేసులు, 1,34,935 మరణాలు నమోదయ్యాయి.రష్యా అభివృద్ధి చేసిన టీకా సేకరణ కోసం ఆ దేశంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పార్లమెంటుకు తెలిపింది. ఈ మేరకు కేంద్ర వైద్య శాఖ సహాయ మంత్రి లోక్‌సభలో తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా 36 టీకాలు వివిధ క్లినికల్‌ ట్రయల్స్‌ దశల్లో ఉన్నాయని, ఇందులో రెండు భారత కంపెనీలకు చెందినవని చెప్పారు. అడ్వాన్స్‌డ్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతమైతే వచ్చే ఏడాది తొలి త్రైమాసికానికి సమర్థమైన టీకా అందుబాటులోకి వస్తుందని మరో ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.