హైదరాబాద్‌: సెకండ్ వీక్‌లో అంద‌రూ అనుకున్నట్టుగానే గురువారం ఎపిసోడ్‌లో ముక్కు అవినాష్ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ సెట్స్ లో ఏసీ గ‌దులుండ‌టంతో గంగ‌వ్వ‌కు ఆ గాలి ప‌డ‌క‌..అస్వ‌స్థ‌త‌కు లోనైంది. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న గంగ‌వ్వ‌ను బిగ్ బాస్ క‌న్ఫెష‌న్ రూంలోకి పిలిచాడు. గంగ‌వ్వ‌ను ఆరోగ్యం ఎలా ఉంద‌ని అడిగాడు. త‌న‌ను అంతా బాగానే చూసుకుంటున్న‌రు, కానీ త‌న భ‌ర్త కొట్టిన దెబ్బలు మ‌ళ్లీ త‌న‌ను ఇబ్బంది పెడుతున్నాయ‌ని, ఇక్క‌డున్న ఏసీ వాతావ‌ర‌ణం, తిండి త‌న‌కు ప‌డ‌టం లేద‌ని గోడు బిగ్ బాస్ తో త‌న బాధ‌చెప్పుకుంది గంగ‌వ్వ‌. తాను 2 నెల‌లుందామ‌ని ఇక్క‌డికొచ్చాను. కానీ త‌న వ‌ల్ల కావ‌డం లేద‌ని చెప్పింది. మీరు గట్టి మ‌నిషి అని..ఇలాంటి ఎన్నో క‌ష్టాల‌న చూసి ఇక్క‌డిదాకా వ‌చ్చార‌ని గంగ‌వ్వ‌కు ధైర్యం చెప్పేందుకు ప్ర‌య‌త్నించినా..తాను ఇక్క‌డ ఉండ‌లేక‌పోతున్నాన‌ని, ఇంట్లో నుంచి పంపించేయాల‌ని కోరింది. దీంతో గంగ‌వ్వ‌ను మెడిక‌ల్ రూంకు పంపించి డాక్ట‌ర్ల‌తో చికిత్స‌నందించారు. అయితే బిగ్ బాస్ షో చూస్తున్న వారిలో ఇప్ప‌టివ‌ర‌కు గంగ‌వ్వ‌ను గెలిపించాల‌నుకున్న‌వాళ్లు..బిగ్ బాస్ హౌజ్ లో ఉండేందుకు గంగ‌వ్వ క‌ష్ట‌ప‌డుతున్న క‌ష్టాన్ని చూసి..ఆమెను ఇంటికి పంపించ‌డమే మేల‌ని అనుకుంటున్నారు. 

 

ఇక ముక్కు అవినాష్ వైల్డ్ కార్డు ఎంట్రీ త‌ర్వాత ఏం జ‌రిగిందో తెలుసుకుందాం. .ఉద‌యం పాట‌కు బ‌దులుగా వాయిస్ ఓవ‌ర్ తోనే ఇంటిస‌భ్యులంతా నిధ్ర‌లేచారు. అవినాష్ బిగ్ బాస్ హౌజ్ లోకి రాక‌ముందే ఈ రోజు నా రోజు అంటూ చెప్పుకొచ్చాడు. సంతోషానికి, బాధ‌కు మ‌ధ్య న‌లిగిపోయే చిన్న ప‌దం జోక‌ర్. ఆ జోక‌ర్ వెనుకే జీవితం ఉందంటూ ఏవీ చూపించారు. ఆ త‌ర్వాత అంద‌రినీ క‌డుపుబ్బా న‌వ్వించే జోక‌ర్ గా ఇక్క‌డికొచ్చానంటూ బిగ్ బాస్ హౌజ్ లోకి ప్ర‌వేశించాడు.