• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

రాజ్యసభ సభ్యుడు అమర్‌సింగ్‌ ఇక లేరు

దిల్లీ: దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన రాజ్యసభ సభ్యుడు, సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత అమర్‌సింగ్‌ ఇక లేరు. సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. మూత్రపిండాల మార్పిడి చేయించుకున్న అమర్‌సింగ్‌.. గత ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో శనివారం మధ్యాహ్నం ఐసీయూలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఆయన కుటుంబం కూడా ఐసీయూ పక్కనే ఓ గది తీసుకొని ఉంటున్నట్టు సమాచారం. అమర్‌ సింగ్‌ వయస్సు 64 ఏళ్లు. 2008లో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి అణు ఒప్పందం విషయంలో వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకున్న సందర్భంలో సమాజ్‌వాదీ పార్టీ మద్దతు ఇచ్చే విషయంలో అమర్‌సింగ్‌ కీలకంగా వ్యవహరించారు. అయితే, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో 2010లో అమర్‌సింగ్‌, సినీనటి జయప్రదను సమాజ్‌వాదీ పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. అమర్‌సింగ్‌ 1996లో తొలిసారి యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2003 జూన్‌లో, తాజాగా 2016లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన అనేక పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు.