• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

సుశాంత్‌తో ఏడాదిపాటు స‌హ‌జీవ‌నం

ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్‌తో ఏడాది కాలం పాటు స‌హ‌జీవ‌నం చేసిన‌ట్లు రియా చ‌క్ర‌వ‌ర్తి పేర్కొన్న‌ది.  సుప్రీంకోర్టుకు స‌మ‌ర్పించిన పిటిష‌న్‌లో ఈ విష‌యం వెల్ల‌డైంది.  సుశాంత్ మృతిపై బీహార్ పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన నేప‌థ్యంలో.. ఆ కేసును ముంబైకి బ‌దిలీ చేయాలంటూ రియా కోర్టులో పిటిష‌న్ వేసింది. హీరో సుశాంత్‌తో ఏడాది పాటు లీవిన్ రిలేష‌న్‌షిప్‌లో ఉన్న‌ట్లు ఆ అభ్య‌ర్థ‌న‌లో రియా తెలిపింది. జూన్ 8వ తేదీన సుశాంత్ ఇంటి నుంచి వెళ్లిపోయిన‌ట్లు ఆమె పేర్కొన్న‌ది.  రియా వెళ్లిన ఆరు రోజుల త‌ర్వాత అంటే జూన్ 14వ తేదీన సుశాంత్ త‌న ఇంట్లో ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. సుశాంత్ డిప్రెష‌న్‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు త‌న పిటిష‌న్‌లో రియా పేర్కొన్న‌ది. అయితే త‌నను వేధించేందుకే సుశాంత్ తండ్రి త‌న‌పై కేసు దాఖ‌లు చేసిన‌ట్లు పిటిష‌న్‌లో రియా పేర్కొన్న‌ది. బీహార్ పోలీసులు ద‌ర్యాప్తులో భాగంగా త‌న‌ను వేధించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఆమె వెల్ల‌డించింది. సుశాంత్ తండ్రి కేకే రాజ్‌పుత్ బీహార్ పోలీసు శాఖ‌లో ప‌నిచేశార‌ని, త‌న‌కు న్యాయం జ‌రగ‌దు అని ఆమె పిటిష‌న్‌లో పేర్కొన్న‌ది.  సుశాంత్‌ను రియాతో పాటు ఆమె కుటుంబ‌స‌భ్యులు మాన‌సికంగా వేధించార‌ని, త‌న కుమారుడిని సూసైడ్ చేసుకునేలా ప్రోత్స‌హించార‌ని తండ్రి కేకే రాజ్‌పుత్ ఆరోపించారు. సుశాంత్ అకౌంట్ నుంచి 15 కోట్లు ఎక్క‌డికి బ‌దిలీ అయ్యాయ‌న్న కోణంలో ఈడీ ద‌ర్యాప్తు చేప‌ట్ట‌నున్న‌ది. రియా ప‌రిచ‌యం అయ్యాకే సుశాంత్‌కు సినీ అవ‌కాశాలు త‌గ్గాయ‌ని, దాంతో అత‌ను మాన‌సికంగా వేద‌న‌కు గురైన‌ట్లు కేకే ఆరోపించారు.  
 

Related News