గూగుల్‌కు చెందిన ఆండ్రాయిడ్‌ తన రెగ్యులర్ సంప్రదాయానికి బ్రేక్ వేసింది. ఆండ్రాయిడ్ నుంచి వచ్చే కొత్త ఓఎస్‌ వెర్షన్‌‌లకు పలు రకాల తీపి పదార్థాల పేర్లు పెడుతూ వస్తున్న గూగుల్ ఈసారి తన పంథా మార్చుకుంది. కొత్తగా విడుదల చేయబోయే ఓఎస్ వెర్షన్‌కు ‘ఆండ్రాయిడ్ 10’ అని నామకరణం చేసింది. ఈ మేరకు గూగుల్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. కొత్త ఓఎస్‌కు పేరు పెట్టే సంప్రదాయానికి తొలిసారి మార్పు చేసినట్లు ఆండ్రాయిడ్‌ ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సమీర్‌ సమత్‌ తెలిపారు.  దీంతో పాటు ఆండ్రాయిడ్‌ 10 లోగోను కూడా కొత్తగా రూపొందించి విడుదల చేసింది. ఇంకా కొన్ని మార్పులు కూడా చేసింది. ఎప్పుడూ ఆకుపచ్చ రంగులో వుండే లోగోను నలుపు రంగులోకి మార్చింది. కళ్లకు ఇంపుగా కనిపించడంతో పాటు, దృష్టి లోపం ఉన్నవారి కోసం ఈ మార్పులు చేసినట్లు గూగుల్‌ పేర్కొంది.

అలాగే ఆండ్రాయిడ్‌ రోబో కూడా ఈసారి పేరు పైన ఉండేట్లుగా డిజైన్ మార్చింది. మరికొన్ని వారాల్లో ఆండ్రాయిడ్‌ 10ను అధికారికంగా విడుదల చేయనున్నట్టు చెప్పింది. ‘ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేశాం. అందరికీ అర్థమయ్యే విధంగా దీనికి సింపుల్‌గా ఆండ్రాయిడ్‌ 10 అని నామకరణం చేశాం’ అని సమీర్ సమత్ తెలిపారు.