న్యూఢిల్లీ: ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న కేంద్ర మంత్రి అమిత్‌షా మరోమారు అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో తిరిగి ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్)లో చేరారు. శనివారం రాత్రి సుమారు 11 గంటలకు షా ఎయిమ్స్‌లోని కార్డియో న్యూరో టవర్‌లో అడ్మిట్ అయ్యారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా అమిత్ షా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. దీనికి ముందు కూడా షా పోస్ట్- కోవిడ్ ట్రీట్‌మెంట్ కోసం ఎయిమ్స్‌లో చేరారు. ఆగస్టు 31న డిశ్చార్జ్ అయ్యారు. కాగా అమిత్ షా ఆగస్టు 2న కరోనా పాజిటివ్‌గా తేలడంతో గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం ఆగస్టు 14న అమిత్‌షాకు కరోనా నెగిటివ్ రిపోర్టు వచ్చింది.