కాన్పూర్‌: కాన్పూర్‌ వేదికగా జరిగిన చివరి వన్డేలో కోహ్లీసేన ఉత్కంఠకర విజయం సాధించింది. పర్యాటక జట్టును 6 పరుగుల తేడాతో ఓడించింది. భారత్‌ నిర్దేశించిన 338 పరుగుల లక్ష్యాన్ని కివీస్‌ దాదాపు ఛేదించేసింది. కానీ ఆఖరి మూడు ఓవర్లలో అద్భుతం జరిగింది. జస్ప్రీత్‌ బుమ్రా (3/47) తన డెత్‌బౌలింగ్‌ పవర్‌ చూపించాడు. ప్రత్యర్థి కలను చిదిమేశాడు. అంతకు ముందు రోహిత్‌ శర్మ (147; 138 బంతుల్లో 18×4, 2×6), విరాట్‌ కోహ్లీ (113; 106 బంతుల్లో 9×4, 1×6) శతకాలు బాదడంతో భారత్‌ 337/6 పరుగులు చేసింది. ఛేదనకు దిగిన కివీస్‌కు శుభారంభం లభించలేదు. 
 
మార్టిన్‌ గప్తిల్‌ (10) జట్టు స్కోరు 44 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఐతే మరో ఓపెనర్‌ కొలిన్‌ మన్రో (75; 62 బంతుల్లో 7×4, 3×6) తొలి ఓవర్‌ నుంచే దూకుడుగా ఆడాడు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో 6,4,4,4 భువీకి చెమటలు పట్టించాడు. కేన్‌ విలియమ్సన్‌ (64; 84 బంతుల్లో 8×4)తో కలిసి రెండో వికెట్‌కు 109 పరుగుల భాగస్వామ్యం అందించాడు. 153 వద్ద అతడిని చాహల్‌ బౌల్డ్‌ చేశాడు. రాస్‌టేలర్‌ (39; 47 బంతుల్లో 3×4)తో కలిసి విలియమ్సన్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. 28.4వ బంతికి అతడినీ చాహల్‌ ఔట్‌ చేయడంతో మ్యాచ్‌ కాస్త నెమ్మదించింది. ఐతే టామ్‌ లేథమ్‌ (65; 52 బంతుల్లో 7×4) పట్టువదల్లేదు. టేలర్‌తో కలిసి 79, హెన్రీ నికోల్స్‌ (37)తో కలిసి 59 పరుగుల భాగస్వామ్యాలు నమోదు చేశాడు. కీలక సమయంలో 46.5వ బంతికి భువి నికోల్స్‌ను ఔట్‌ చేశాడు. మరో ఆరు పరుగులకే గ్రాండ్‌హోమ్‌ (8)తో సమన్వయ లోపంతో రనౌట్‌ కావడంతో మ్యాచ్‌ మలుపు తిరిగింది. చివరి ఓవర్‌లో 15 పరుగులు చేయాల్సి ఉండగా కివీస్‌ 8 మాత్రమే చేయడంతో విజయం భారత్‌ను వరించింది. కోహ్లీసేనకు ఇది వరుసగా ఏడో సిరీస్‌ విజయం