• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

మైగ్రెంట్స్ డెత్ మిస్టరీ..ఫోరెన్సిక్ రిపోర్టే కీలకం

వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం  గొర్రెకుంటలో వలస కార్మికుల అనుమానాస్పద మృతిపై ట్విస్టుల మీద ట్విస్టులు వెలువడుతున్నాయి. అయితే ఈ ఘటనను ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగడంతో కేసుకు సంబంధించిన అంశాల్లో పురోగతి కనిపిస్తుంది. గురువారం సుప్రియ కోల్డ్ స్టోరేజీ సమీపంలోని గన్నీ సంచుల తయారీ గోదాము పక్కనే వున్న పాడుబడ్డ బావిలో నాలుగు మృతదేహాలు లభ్యమవ్వడంతో వలస కార్మికుల ఆకలి చావులేమోనని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే తర్వాత రోజు శుక్రవారం ఒకదాని తర్వాత మరొకటిగా ఐదు మృతదేహాలు లభ్యమవ్వడంతో వీరి అనుమానాస్పద మృతి వెనకాల చిక్కుముడులను పోలీసులు పలు కోణాల్లో ఆరా తీస్తున్నారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన మక్సూద్ కుటుంబ సభ్యులు ఆరుగురు, బీహార్ కు చెందిన శ్రీరాం, శ్యాంలతో పాటు వెస్ట్ త్రిపురకు చెందిన షకీలు వీరందరూ కూడా ఒకే బావిలో విగతజీవులుగా లభ్యమవ్వడంతో వరంగల్ నగర కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవిందర్ ఆధ్వర్యంలో క్లూస్ టీం, డాగ్ స్క్రాడ్ తో సంఘటనా స్థలాన్ని విస్తృతస్థాయిలో పరిశీలించారు.

మొదట ఆధారాలేమీ దొరకకపోవడంతో అనుమానితుడు స్థానికుడైన యాకూబ్ తో పాటు మరో ఇద్దరు బీహార్ వలస కార్మికులను  అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా గన్నీసంచుల గోదాంలో పనిచేసే 20మంది బీహర్ వలస కార్మికులను సైతం పోలీసులు తమదైన శైలిలో ఆరా తీస్తున్నారు. ఈ కేసును ఛేదించేందుకు 7 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కేసును ఛేధించడంపై దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీస్ శాఖ ,ఫోరెన్సిక్ అధికారులు శనివారం మరోసారి గన్నీ సంచుల గోదాం పరిసర ప్రాంతాలతో పాటు, బావి పరిసర ప్రాంతాలను పరిశీలించారు.  సంఘటనా స్థలానికి కొద్ది దూరంలో దొరికిన మూడు ఫోన్లలో కాల్ డాటాతో పాటు, మక్సూద్ కు చెందిన ఫోన్ కాల్ డాటాను పోలీసులు పరిశీలిస్తున్నారు.


వరంగల్ ఎంజీఎంలో 9మంది వలస కార్మికుల మృతదేహాలకు శుక్రవారం అర్ధరాత్రి పోస్టుమాత్రం పూర్తైంది. వీరిలో మక్సూద్ మరియు బీహార్ వలస కార్మికులు శ్రీరాం, శ్యాం ల కుటుంబసభ్యులకు ఇప్పటికే సమాచారం అందించారు.  షకీల్ మృతదేహాన్ని అతని భార్య ,కుటుంబ సభ్యులకు అధికారులు అప్పగించారు. అయితే మృతుడు షకీల్ భార్య పిల్లలు మాత్రం బుధవారం రాత్రి మక్సూద్ చేశాడని, మక్సూద్ ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళిన తమ తండ్రి షకీల్ విగతజీవిగా మిగలడం జీర్ణించుకోలేక పోతున్నామని కన్నీళ్ళపర్యంతమయ్యారు.

 

ఎంజీఎంలో తొమ్మిదిమంది వలస కార్మికుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తిచేసిన వైద్యులు పలు షాంపుల్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. అయితే మక్సూద్ కూతురు బుస్రా ప్రేమ వ్యవహారమే ఈ అఘాయిత్యానికి దారి తీసి వుంటుందని , షకీల్ భార్య, కుటుంబసభ్యుల మాటల ప్రకారం అనుమానాలను కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో బుస్రా కుమారుని బర్త్ డే సందర్భంగా అందరూ కలిసి ఒకే రకమైన ఆహారాన్ని తిన్నట్లు తెలుస్తోంది. అయితే ఫుడ్ లో పాయిజన్ ప్రయోగంతోనే ఈ దుర్ఘటన జరిగిందా అనే అనుమానానికి బలం చేకూరుతోంది. ఏది ఏమైనా పోలీసులకు సవాలుగా మారిన ఈ కేసులో ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగానే వలస కార్మికుల మృతిపై స్పష్టత రానుంది.

Related News