• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

ప్రణబ్‌ ముఖర్జీకి భారతరత్న అవార్డు ప్రదానం

దిల్లీ: దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారతరత్న పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. 2019 ఏడాదికి గాను దేశ అత్యున్నత పురస్కారాన్ని ముగ్గురికి ప్రకటించగా.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గురువారం ఈ అవార్డులను ప్రదానం చేశారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, దివంగత సంఘ సంస్కర్త నానాజీ దేశ్‌ముఖ్‌, దివంగత దర్శక నిర్మాత, ప్రముఖ సంగీత విద్వాంసుడు భూపేన్‌ హజారికాకు భారతరత్న పురస్కారాలు ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే, ఈ రోజు జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా అత్యున్న పురస్కారాన్ని అందుకోగా..భూపేన్‌ హజారికా  తరఫున ఆయన తనయుడు తేజ్‌ హజారికా, నానాజీ దేశ్‌ముఖ్‌ తరఫున ఆయన కుటుంబ సభ్యులు అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును అందుకున్న అనంతరం ప్రణబ్‌ ముఖర్జీకి పలువురు నేతలు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమంత్రి అమిత్‌ షా, పలువురు కేంద్రమంత్రులు, పలు పార్టీలకు చెందిన నేతలు, పలు రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.
 

Related News