• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

సుప్రసిద్ధ మిమిక్రీ కళాకారుడు హరికిషన్ (57) కన్నుమూత

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హరికిషన్
కెరీర్ లో 10 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చిన హరికిషన్
గంట వ్యవధిలో 100 గొంతుకలు అనుకరించిన రికార్డు

హైదరాబాద్ : మిమిక్రీ రంగంలో ఎంతో కృషి చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హరికిషన్ (57) మృతి చెందారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. హరికిషన్ మృతి అటు మిమిక్రీ రంగంలోనే కాదు, సినీ పరిశ్రమలోనూ విషాదం నింపింది. ఆయన అనేక చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించి నటుడిగానూ అలరించారు. హరికిషన్ ఎవరి గొంతునైనా ఇట్టే అనుకరిస్తారని ప్రతీతి. 70వ దశకంలో కెరీర్ ప్రారంభించిన ఆయన ఇప్పటివరకు 10 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. 60 నిమిషాల వ్యవధిలో 100 మంది గొంతుకలను అనుకరించిన రికార్డు హరికిషన్ సొంతం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో  మే 30, 1963న హరికిషన్ జ‌న్మించారు. 8 ఏళ్ల వయసులోనే తన గురువులను తోటి వాళ్ల గొంతులను మిమిక్రీ చేయడాన్ని ప్రారంభించారు. అగ్రశ్రేణి మిమిక్రీ ఆర్టిస్టు నేరేళ్ల వేణుమాధవ్ స్ఫూర్తిగా ఈ రంగంలోకి వచ్చారు. మొదట్లో కొన్నాళ్లపాటు హైదరాబాదులోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన హరికిషన్, కెరీర్ కోసం ఉద్యోగాన్ని వదులుకుని పూర్తిగా మిమిక్రీ కళా ప్రదర్శనలపైనే దృష్టి సారించారు.  హరికిషన్.  ఆయ‌న మిమిక్రీకి ఎంతో మంది ముగ్ధులు కాగా, సెల‌బ్రిటీలు కూడా త‌న టాలెంట్‌కి ఫిదా అయ్యారు. హరికిష‌న్  కేవలం మిమిక్రీ మాత్రమే కాక‌ పశు పక్ష్యాదుల శబ్ధాలతో పాటు యంత్రాలు చేసే శబ్ధాలు.. సంగీత వాద్య పరికరాల సౌండ్స్‌ను తన గొంతులో ప‌లికించారు. దేశ విదేశాల‌లో ఎన్నో ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చిన హ‌రికిష‌న్  ప్రముఖ నటుడు శివారెడ్డికి   గురువు కూడా.  మిమిక్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం లిఖించుకున్న హ‌రికిష‌న్ మృతి తెలుగు వారికి తీర‌ని విషాదాన్ని మిగిల్చింది.  రాజ‌కీయ నాయ‌కులు, సినీ ప్ర‌ముఖులు ఆయ‌న మృతికి సంతాపం తెలియ‌జేస్తున్నారు. 
 

Related News