• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

జీవో నెం. 550 కేసు విచారణ వాయిదా

హైదరాబాద్ : వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ జారీచేసిన జీవో నెం. 550 ప్రకారమే రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లను భర్తీచేస్తున్నామని కాళోజీ నారాయణరావు ఆరోగ్యశాస్త్రాల విశ్వవిద్యాలయం (కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్) పేర్కొన్నది. కన్వీనర్ కోటా సీట్ల భర్తీలో రిజర్వేషన్లు పాటించడంలేదని పలువురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌లో యూనివర్సిటీ రిజిష్ర్టర్ డీ ప్రవీణ్‌కుమార్ మంగళవారం కౌంటర్ దాఖలు చేశారు. ప్రభుత్వ జీవో ప్రకారం మొదటి దశ కౌన్సెలింగ్‌లో 50 శాతం ఓపెన్ క్యాటగిరీ సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాటగిరీలతో సంబంధం లేకుండా మెరిట్ ప్రకారం, రిజర్వుడు క్యాటగిరీ సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేసస్తున్నట్లు తెలిపారు. మెరిట్ ప్రకారం ఓపెన్ కోటాలో సీట్లు పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఉత్తమ కాలేజీ, ఉత్తమ కోర్సుల కోసం తిరిగి రిజర్వుడు క్యాటగిరీలో సీటు పొందేందుకు అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. ఓపెన్ కోటాలో ఖాళైన సీటును మళ్లీ అదే క్యాటగిరీకి చెందిన మెరిట్ విద్యార్థులతో భర్తీ చేస్తున్నామని తెలిపారు. దీంతోపాటు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఓపెన్ క్యాటగిరీ, రిజర్వుడు సీట్లు 50 శాతానికి మించకుండా వ్యవహరిస్తున్నామని తెలిపారు. పిటిషన్ దాఖలు చేసిన విద్యార్థులకు ఆయా క్యాటగిరీల్లో కటాఫ్ కన్నా ఎక్కువ నీట్ ర్యాంకు వచ్చినందున వారికి ఎంబీబీఎస్‌లో సీటు లభించలేదని పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులు ఆయా కోర్సుల్లో చేరకుండా సీట్లు ఖాళీగా ఉండే సందర్భాల్లో ఖాళీగా ఉన్న సీట్లును అదే క్యాటగిరీ అభ్యర్థులతో భర్తీ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. రిజర్వేషన్ల విషయంలో ఎవరికీ అన్యాయం జరుగడంలేదని అన్నారు. ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదావేసింది.
 

Related News