• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

తల్లి ఒడికి చేరిన జసిద్

తూర్పుగోదావరి జిల్లా : మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠను రేపుతున్న బాలుడు జసిద్ కిడ్నాప్ ఉదంతం సుఖాంతం అయ్యింది. ఎట్టకేలకు బాలుడ్ని ఎత్తుకెళ్లిన దుండగులు గురువారం తెల్లవారుజామున అనపర్తి మండలం కుతుకులూరు రోడ్డు దగ్గర వదిలి పారిపోయారు. ఎవరు ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి బాబుని వదిలి వెళ్లడం దగ్గర్లో ఉన్న క్వారీలో పనిచేసే కూలీలు చూశారని, వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే తమ బృందం ఘటనా స్థలికి చేరుకుని బాబుని తీసుకొచ్చినట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అష్మీ మీడియాకు తెలిపారు. అనంతరం బాబును తమ బృందాలతో కలిసి స్వయంగా తానే తల్లిదండ్రులకు అప్పగించినట్లు వివరించారు. బాబుకు ఎటువంటి గాయాలు లేవని, క్షేమంగా ఉన్నాడాని అన్నారు. త్వరలో కిడ్నాపర్లను పట్టుకుంటామని, అన్నారు. బాలుడ్ని రక్షించడంలో సహకరించిన ప్రజలకు, మీడియా, ముఖ్యంగా సోషల్ మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. 

ఎప్పుడు జరిగింది ఈ ఘటన...?

 జసిద్ నానమ్మ పార్వతితో కలిసి బాబు సోమవారం సాయింత్రం ప్లాట్ లోకి వెళుతున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి దాడి చేసి, జసిద్ ను కిడ్నాప్ చేశారు. దాంతో ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. తల్లిదండ్రులు వెంకటరమణ, నాగావళి దంపతులు బాబు కిడ్నాప్ కు గురవడంతో శోక సముద్రంలో మునిగిపోయారు. మరోవైపు తల్లి నాగావళి తొమ్మిది నెలల గర్భవతి అయిఉండి కొడుకు కోసం కన్నీరు పర్యంతం అవుతూ చూపరులను మరింత కలిచివేసింది. దాంతో ఇటు స్థానికులు, సోషల్ మీడియా, రెగ్యులర్ మీడియాలో ఈ కిడ్నాప్ ఉదంతంపై పెద్దఎత్తున సమాచారం షేర్ చేశారు. ఎవరైనా బాబు ఆచూకి దొరికితే వెంటనే తెలియచేయాలంటూ పోస్టులు వెరల్ చేశారు. దాంతో పోలీసులు కేసును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మొత్తం ఆరుగురు డీఎస్పీలు, 10 మంది సీఐలు, 500 మంది సిబ్బందితో మొత్తం 17 బృందాలుగా ఏర్పాటు చేసి కేసును పర్యవేక్షిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. బాబు తల్లిదండ్రులు  శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసకు చెందినవారు. ఏడాది క్రితం బదిలీపై మండపేటకు వచ్చారు.

Related News