• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

తెలంగాణ దంపతుల కోసం గాలింపు

మావోయిస్టు సుధాకర్‌పై రూ.25 లక్షలు..నీలిమపై రూ.10 లక్షల రివార్డు.  ఝార్ఖండ్‌ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్న నక్సల్స్‌ జాబితాలో తెలంగాణ దంపతులు.
రాంచీ: ఝార్ఖండ్‌ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్న మావోయిస్టు నేతల జాబితాలో ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్‌ అలియాస్‌ కిరణ్‌ అలియాస్‌ శరద్‌, అతని భార్య, పార్టీ ప్రత్యేక కమిటీ సభ్యురాలు నీలిమా అలియాస్‌ పద్మ అలియాస్‌ జయ అగ్రస్థానంలో ఉన్నారు.ఆ జాబితాలో మొత్తం 12 మంది నక్సల్స్‌ నేతల పేర్లు ఉండగా తొలి రెండు పేర్లు వీరివే. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వీరు చాలా కాలంగా అజ్ఞాతంలో ఉంటూ మావోయిస్టు కార్యకలాపాలను చేపడుతున్నారు. గెరిల్లా యుద్ధతంత్రంలో, వ్యూహారచనలో దిట్ట అయిన సుధాకర్‌ను పట్టిచ్చినా లేదా అతని సమాచారాన్ని అందించినా రూ.25లక్షలు, నీలిమా ఆచూకీ తెలిపిన వారికి రూ.10లక్షల రివార్డు ఇస్తామని ఝార్ఖండ్‌ పోలీసులు గోడ పత్రికల ద్వారా ప్రకటించారు. నక్సల్స్‌ ఏరివేత చర్యలను ముమ్మరంచేయటంతో మావోయిస్టులకు చెందిన 30 మంది అగ్ర నాయకులు అరెస్టు అయ్యారని, మిగిలిన వారిలో ముఖ్యులు వయోభారంతో ఆ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనలేకపోతున్నారని పోలీసులు వెల్లడించారు. అయితే, సుధాకర్‌, నీలిమాలు పార్టీని పునరుద్ధరించే యత్నంలో రాష్ట్రంలో పర్యటిస్తూ కార్యకర్తలను సమీకరిస్తున్నారని, అందుకే వీరిని తమ ప్రధాన లక్ష్యంగా చేసుకున్నట్లు ఝార్ఖండ్‌ పోలీసులు తెలిపారు. పోలీసులు గోడపత్రికల్లో పేర్కొన్న వ్యక్తుల్లో రవీంద్ర గంఝు, దీపక్‌ ఓరాన్‌, భూషణ్‌ ఓరాన్‌, బలరామ్‌ ఓరాన్‌, మునేశ్వర్‌ ఓరాన్‌ తదితరులు ఉన్నారు. వీరి ఒక్కొక్కరి తలపై రూ.10లక్షల చొప్పున రివార్డు ఉంది. 

Related News